- రామేశ్వరం బండలో వెంచర్ల రాజ్యం
ఇరిగేషన్ శాఖ నిద్రలో… ప్రజలు ముంపులో!
ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని రామేశ్వరం బండ గ్రామంలో వెంచర్ల దందా బహిరంగంగా కొనసాగుతోంది. సహజ కాలువలు, కల్వర్టులను నిర్దాక్షిణ్యంగా మూసివేస్తూ రోడ్లు వేస్తున్నా అధికారులు చూస్తూ ఊరుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.గ్రామంలో పలు కీలక నీటి మార్గాలను మట్టితో నింపి పూర్తిగా బ్లాక్ చేయడంతో వర్షాకాలంలో నీరు ఎక్కడికక్కడ నిల్వై ముంపు పరిస్థితులు ఏర్పడిే అవకాశాలున్నాయి. రైతుల పంటలు నాశనం కావడమే కాకుండా, ఇళ్లలోకి నీరు చేరే పరిస్థితి నెలకొంటుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది అంతా జరుగుతున్నా కాలువల పరిరక్షణ బాధ్యత వహించే ఇరిగేషన్ శాఖ మాత్రం నిద్రలోనే ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ మౌనం వెనుక వారి లాభ ఎంతో? అధికారులు స్పందించకపోవడం వల్లే వెంచర్ నిర్వాహకులు మరింత రెచ్చిపోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తూ, సహజ నీటి ప్రవాహాలను అడ్డుకోవడం వల్ల భూగర్భ జలాలు తగ్గిపోవడం, భవిష్యత్తులో భారీ వరదలు సంభవించే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని అక్రమ లేఅవుట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, కాలువలను తక్షణమే పునరుద్ధరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

