జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదన్న ఆరోపణలు మెదక్ జిల్లా యెల్దుర్తి మండలం కుకూనూర్ గ్రామంలో వినిపిస్తున్నాయి. అక్రమ నిర్మాణంపై కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా సంబంధిత అధికారులు ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని బాధితుడు యామవరం రఘువీర శర్మ ఆరోపిస్తున్నారు.బాధితుడి కథనం ప్రకారం, తనకు చెందిన స్థలంతో పాటు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి గ్రామ పంచాయతీ అనుమతులు లేకుండానే జీ+2 భవన నిర్మాణం చేపట్టారని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అనంతరం జరిగిన విచారణలో భవన నిర్మాణ నిబంధనల ఉల్లంఘనతో పాటు సెట్‌బ్యాక్ నిబంధనలు పాటించకపోవడం, ప్రభుత్వ భూమి, డ్రైనేజీ కాలువలపై నిర్మాణాలు జరిగినట్లు సంబంధిత అధికారుల నివేదికలో నమోదైనట్లు ఆయన తెలిపారు.ఈ నివేదిక ఆధారంగా పంచాయతీరాజ్ చట్టం–2018లోని నిబంధనల మేరకు అక్రమ నిర్మాణాన్ని తొలగించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్లు బాధితుడు పేర్కొన్నారు. అవసరమైతే పోలీసు బందోబస్తుతో కూల్చివేత చేపట్టాలని, మొత్తం వ్యవహారాన్ని సంబంధిత మండల అధికారులు పర్యవేక్షించి నివేదిక సమర్పించాలని కూడా ఆదేశించినట్లు తెలిపారు.అయితే కలెక్టర్ ఉత్తర్వులు వెలువడి నెలలు గడిచినా క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్యలు కనిపించలేదని బాధితుడు ఆరోపిస్తున్నారు. అక్రమ నిర్మాణాన్ని తొలగించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అధికార పార్టీ నేతల ఒత్తిళ్ల కారణంగానే చర్యలు ఆలస్యం అవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయని చెప్పారు. చిన్నపాటి నిర్మాణాల విషయంలో వెంటనే స్పందించే అధికారులు, ఈ వ్యవహారంలో మాత్రం మౌనం పాటించడం పట్ల స్థానికులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.ఈ వ్యవహారంపై జిల్లా యంత్రాంగం మరోసారి జోక్యం చేసుకుని కలెక్టర్ ఆదేశాలను అమలు చేయడంతో పాటు అక్రమ నిర్మాణంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితుడు యామవరం రఘువీర శర్మ విజ్ఞప్తి చేశారు.
కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్?.. అక్రమ నిర్మాణంపై చర్యలు ఎక్కడ!అక్రమ నిర్మాణానికి అధికారుల అండ ఉందన్న ఆరోపణలుకూల్చివేయాలని ఉత్తర్వులిచ్చినా అమలుకాని ఆదేశాలుప్రైవేట్, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని బాధితుడి విజ్ఞప్తి
RELATED ARTICLES

