Sunday, August 2, 2026

ఆధ్యాత్మిక శోభితం శ్రీ గాయత్రి దేవి క్షేత్రం..- బీహెచ్‌ఈఎల్ విద్యుత్ నగర్‌లో భౌమ అమావాస్య ప్రత్యేక పూజలు..- వైభవంగా మహా చండీ సహిత బగాలాముఖి హోమం..

పటాన్ చెరు, జూలై 14 బీహెచ్ఈఎల్ విద్యుత్ నగర్ ఎంఐజీ కాలనీలోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రమైన శ్రీ వేదమాత గాయత్రీ దేవి క్షేత్రము ప్రాంగణంలో భౌమ అమావాస్య, నిజ జ్యేష్టా అమావాస్యను పురస్కరించుకుని మంగళవారం ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. ప్రముఖ వేద పండితులు, అర్చకులు రఘువీర శర్మ పర్యవేక్షణలో, వేద మంత్రోచ్ఛారణల మధ్య ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా సాగాయి. ఈ పవిత్ర దినాన్ని పురస్కరించుకుని లోక కల్యాణార్థం, భక్తుల సకల జనాకర్షణ, శత్రు నివారణ కు, పీడా నివారణల కోసం ఆలయంలో “మహా చండీ సహిత బగాలాముఖి హోమం” అత్యంత నిష్ఠతో నిర్వహించారు. రఘువీర శర్మ ఆధ్వర్యంలో రుత్వికులు పూర్ణాహుతి కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పూర్తి చేయగా, హోమ గుండం నుండి వెలువడిన పవిత్ర ధూమంతో ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయింది.అదేవిధంగా గ్రహ దోషాలు, కాల సర్ప దోషాల నివారణకై ఉగ్ర స్వరూపుడైన కాలభైరవ స్వామికి శాస్త్రోక్తంగా ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. అమావాస్య విశిష్టతను పురస్కరించుకుని ఇక్కడి కాళికా దేవిని భయంకర, రక్షణ స్వరూపమైన ప్రత్యేక భద్రకాళి దేవిగా అలంకరించి పూజలు చేశారు. కాళికా దేవికి, కాల భైరవుడికి జరిగిన ఈ ప్రత్యేక సమర్చనా కార్యక్రమాలలో పాల్గొనేందుకు భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా దోష నివారణ కోసం, మానసిక ప్రశాంతత కోసం భక్తులు ఆలయ ప్రాంగణంలో పెద్ద ఎత్తున కూష్మాండ దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. దీనితో పాటు పంచలింగముఖ ఉమామహేశ్వరునికి శైవాగమ పద్ధతిలో ప్రత్యేక బిల్వార్చన, శివారాధన కార్యక్రమాలను కన్నులపండువగా నిర్వహించారు.పూజా కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తయిన అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ మహా అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో బీహెచ్ఈఎల్, విద్యుత్ నగర్, ఎంఐజీ కాలనీతో పాటు పరిసర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి, అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ఈ సందర్భంగా రఘువీర శర్మ మాట్లాడుతూ… అమావాస్య రోజున, ముఖ్యంగా భౌమ అమావాస్య నాడు అమ్మవారికి, కాలభైరవునికి చేసే ఇటువంటి విశేష పూజల వల్ల నకారాత్మక శక్తులు తొలగిపోయి, ఇండ్లలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు వెల్లివిరుస్తాయని భక్తులకు వివరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular